సెకండ్ వేవ్ లో చిన్నారులపై ప్రభావం చూపిస్తున్న కరోనా మహమ్మారి!

08-04-2021 Thu 06:36
  • రోజురోజుకూ విస్తరిస్తున్న వైరస్
  • మార్చి తరువాత 80 వేల మంది పిల్లలకు కరోనా
  • అన్ని వయసుల వారిపైనా ప్రభావం
Corona More Powerful on Children in Second Wave

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు మరింతగా విస్తరిస్తోంది. రోజుకు లక్షకు పైగా కేసులు వస్తున్నాయి. తొలి దశలో యువత, చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపించని కరోనా, రెండో దశలో మాత్రం వారిపై ప్రభావం చూపుతోంది. మార్చి నుంచి ఐదు రాష్ట్రాల్లోని 79,688 మంది చిన్నారులు వైరస్ బారిన పడ్డారు. తొలి దశలో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని బలిగొన్న కరోనా మహమ్మారి, ఇప్పుడు అన్ని వయసుల వారినీ బాధిస్తోంది.

ప్రస్తుతం చిన్నారులకు కొవిడ్ టీకా ఇంకా అందుబాటులోకి రాలేదు. యూకేలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను చిన్నారులపై ప్రయోగించి, ఫలితాలను చూడాలని భావించినా, ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డ కడుతోందని వచ్చిన వార్తలతో ఆ ప్రయోగాలు ఆగిపోయాయి. యూరప్ లో ఇప్పటివరకూ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకుని, రక్తం గడ్డకట్టిన కేసుల్లో ఏడుగురు మరణించడం కలకలం రేపుతోంది.

ఇదిలావుండగా, ఇండియాలో మార్చి 1 నుంచి ఏప్రిల్ నాలుగు మధ్య 60,684 మంది చిన్నారులు కరోనా బారిన పడగా, వారిలో 9,882 మంది ఐదేళ్లలోపు చిన్నారులు కావడం గమనార్హం. ఇదే సమయంలో ఛత్తీస్ గఢ్ లో 6,940 మంది చిన్నారులకు వ్యాధి సోకగా, వారిలో 922 మంది ఐదేళ్లలోపు వారు. ఈ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, యూపీల్లో సైతం దాదాపు 1200 మందికి పైగా ఐదేళ్లలోపు పిల్లలు కరోనా బారిన పడ్డారు. దేశ రాజధానిలోనూ ఇదే పరిస్థితి నెలకొని వుందని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఢిల్లీ పరిధిలో 441 మంది బాలలకు వ్యాధి సోకిందని తెలిపారు.

గత సంవత్సరం లాక్ డౌన్ సమయంతో పోలిస్తే, సరైన కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే చిన్నారులకు వ్యాధి సోకుతోందని, పిల్లలు స్కూళ్లకు వెళ్లడం, బయట తిరుగుతుండటం వంటి కారణాలతో కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ఇదిలావుండగా, ఇప్పుడు ఇండియాలో నిత్యమూ కొత్త కరోనా కేసుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డులను అధిగమిస్తూ, ఆందోళన కలిగిస్తోంది.