విద్యుత్ ద్విచక్రవాహన విపణిపై పట్టుకు హీరో ఎలక్ట్రిక్‌ చర్యలు.. నాలుగేళ్లలో రూ.700 కోట్ల పెట్టుబడులు

07-04-2021 Wed 21:54
  • విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న గిరాకీ
  • మార్కెట్‌లో రాణించేందుకు సిద్ధమవుతోన్న హీరో ఎలక్ట్రిక్‌
  • తయారీని  75 వేల నుంచి 10 లక్షల యూనిట్లకు పెంచే యోచన
  • ఐదేళ్లలో దేశంలో 20 లక్షల విద్యుత్ ద్విచక్రవాహనాలు
Hero electric to invest rs 700 cr to increase production

దేశవ్యాప్తంగా విద్యుత్ ద్విచక్రవాహనాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ మార్కెట్‌లో రాణించేందుకు హీరో ఎలక్ట్రిక్‌ చర్యలు చేపడుతోంది. తయారీ కేంద్ర సామర్థ్యాన్ని 75 వేల యూనిట్ల నుంచి 10 లక్షల యూనిట్లకు పెంచాలని నిర్ణయించింది. అందుకోసం రానున్న 3-4 ఏళ్లలో రూ.700 కోట్లు ఖర్చు వెచ్చించేందుకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్లపత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడిన హీరో ఎలక్ట్రిక్‌ ఎండీ నవీన్‌ ముంజల్‌.. విద్యుత్తు వాహన(ఈవీ) విపణి ఏటా రెట్టింపవుతోందని తెలిపారు. రానున్న ఐదేళ్లలో మొత్తం ద్విచక్రవాహనాల్లో 10 శాతం వాటా ఈవీలే ఉండనున్నాయని అంచనా వేశారు. అలాగే ప్రస్తుతం విద్యుత్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో 40 శాతం వాటా కలిగిన హీరో ఎలక్ట్రిక్... విపణి వృద్ధికి అనుగుణంగా ముందుకు సాగనుందని తెలిపారు.

ప్రస్తుతం ఉన్న వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే రానున్న ఐదేళ్లలో దేశంలో 20 లక్షల విద్యుత్ ద్విచక్రవాహనాలు వుంటాయని నవీన్‌ ముంజల్‌ అంచనా వేశారు. అయితే, ఈ రంగంలో మరిన్ని ప్రోత్సాహకరమైన విధానాలు ప్రవేశపెట్టడం ద్వారా ఆ సంఖ్యను 40 లక్షలకు పెంచే అవకాశం ఉందని తెలిపారు. 2017లో 40 వేల యూనిట్లుగా ఉన్న ద్విచక్రవాహన ఈవీ మార్కెట్‌ 2020-21లో 1.7లక్షల యూనిట్లకు చేరిందని చెప్పారు. దీంట్లో 53,500 యూనిట్లు హీరో ఎలక్ట్రిక్‌కు చెందినవేనని వెల్లడించారు.