ఏపీ సీఎం జగన్ నన్ను భౌతికంగా అంతం చేయాలని చూస్తున్నారు: ప్రధానికి లేఖలో రఘురామకృష్ణరాజు ఆరోపణ
- జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్
- తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్న రఘురామ
- జగన్ ప్రొఫెషనల్ కిల్లర్స్ సాయం తీసుకుంటున్నారని ఆరోపణ
- వై కేటగిరీ భద్రత విస్తరింప చేయాలని ప్రధానికి అభ్యర్థన
ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కానని, అయితే, సీఎం జగన్ నేరచరిత్ర కారణంగా ఆలోచించాల్సి వస్తోందని తెలిపారు. గత కొన్ని వారాలుగా తనపై తప్పుడు కేసుల నమోదుకు ప్రయత్నాలు చేశారని, కానీ ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయని రఘురామకృష్ణరాజు తెలిపారు.
"విశ్వసనీయ వర్గాల నుంచి నాకు అందిన సమాచారం ప్రకారం... నన్ను భౌతికంగా లేకుండా చేసేందుకు కడప జిల్లాలో తనకున్న పాత పరిచయాల ఆధారంగా కొందరు ప్రొఫెషనల్ కిల్లర్స్ సాయం తీసుకుంటున్నట్టు తెలిసింది. అందుకే నా భద్రతపై పునఃపరిశీలన చేయాలని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఓ గన్ మన్ ఎల్లప్పుడూ నా వెంటే ఉండేలా చర్యలు తీసుకోండి. ఇప్పటివరకు నాకు ఏపీలోనూ, హైదరాబాదులోనూ ఉన్నప్పుడే వై కేటగిరీ వర్తింపజేస్తున్నారు. ఇప్పుడా భద్రతను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటారని కోరుతున్నాను" అంటూ తన లేఖలో పేర్కొన్నారు.