'జెర్సీ' దర్శకుడికి చరణ్ గ్రీన్ సిగ్నల్?

07-04-2021 Wed 19:19
  • తెలుగులో 'జెర్సీ' సూపర్ హిట్
  • హిందీలో విడుదల కానున్న రీమేక్
  • చరణ్ ను ఒప్పించిన గౌతమ్    
Charan gave a green signal to Jersey Director

నాని కథానాయకుడిగా క్రికెట్ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ' సినిమాను తెరకెక్కించాడు. 2019లో వచ్చిన ఈ సినిమా, నాని కెరియర్లోనే ఒక ప్రత్యేకమైన సినిమా అనిపించుకుంది. దాంతో యువ కథానాయకులు చాలామంది ఈ దర్శకుడితో కలిసి పనిచేయడానికి ఉత్సాహాన్ని చూపించారు. కానీ ఆయన ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసే పనిలో పడిపోయాడు. షాహిద్ కపూర్ హీరోగా ఆయన రూపొందించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమాను తెలుగులోనే చేయాలనుకుంటున్నాడు. గౌతమ్ తిన్ననూరి గతంలో చరణ్ కి ఒక కథ వినిపించినట్టుగా ప్రచారం జరిగింది. అయితే చరణ్ తన నిర్ణయాన్ని చెప్పవలసి ఉందనే వార్తలు వచ్చాయి. ఇటీవల గౌతమ్ తిన్ననూరి మళ్లీ చరణ్ ను కలిసి ఆ కథను గుర్తుచేశాడట.

కథలోని వైవిధ్యం కారణంగా, తాను ఈ సినిమా చేస్తానని చరణ్ చెప్పాడట. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం చరణ్ 'ఆచార్య' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. మరి గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలపైకి వెళుతుందో చూడాలి.