India: భారత్‌లోకి ప్రవేశించిన పాక్‌ బాలుడు.. స్వీట్లు ఇచ్చి మరీ అప్పగించిన భారత సైన్యం

A PoK boy returned back who entered into India inadvertently
  • సహృదయాన్ని చాటుకున్న భారత ఆర్మీ
  • పొరపాటున వచ్చిన పీఓకేకు చెందిన అబ్బాయి
  • కశ్మీర్‌లోని సాధ్‌పొర ప్రాంతంలోకి ప్రవేశం
  • రెండు రోజులు జాగ్రత్తగా చూసుకున్న సైన్యం
  • మానవతా దృక్పథంతో అప్పగింత
భారత సైన్యం మరోసారి తన సహృదయతను చాటుకుంది. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) నుంచి పొరపాటున భారత భూభాగంలోకి ప్రవేశించిన వ్యక్తిని తిరిగి అప్పగించింది.

 వివరాల్లోకి వెళితే... పీఓకేలోని లిపా ప్రాంతానికి చెందిన మోసిన్‌ అనే 13 ఏళ్ల అబ్బాయి పొరపాటున సోమవారం రాత్రి భారత భూభాగంలోకి వచ్చాడు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సాధ్‌పొర ప్రాంతంలోకి ప్రవేశించాడు. గమనించిన సైనికులు అదుపులోకి తీసుకొని విచారించారు. అనుకోకుండా ఇటువైపు వచ్చినట్లు ధ్రువీకరించుకున్నారు. విషయాన్ని పాక్ సైన్యానికి తెలియజేశారు. వారు స్పందించి తిరిగి ఇవ్వమని కోరే వరకు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైనికులు అతణ్ని తమ వద్దే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకున్నారు.

తర్వాత ఇరు దేశాల సైన్యం మధ్య హాట్‌లైన్‌లో చర్చలు జరిగాయి. అబ్బాయి కుటుంబ సభ్యులతో వివరాలను ధ్రువీకరించుకున్న పాక్ ఆర్మీ అతణ్ని అప్పగించాలని కోరింది. మానవతా దృక్పథంతో వ్యవహరించిన భారత సైన్యం ఆ అబ్బాయిని తిత్వాల్‌ క్రాసింగ్‌ పాయింట్‌ వద్ద పాక్ సైన్యానికి అప్పగించింది. తిరిగిచ్చేటప్పుడు కొత్త బట్టలు, స్వీట్లు బహుమానంగా కూడా ఇవ్వడం గమనార్హం. తిత్వాల్‌ ఇరు దేశాల మధ్య శాంతికి చిహ్నంగా నిలుస్తోంది.
India
pakistan
POK
Indian Army
Jammu And Kashmir

More Telugu News