చరణ్ సాంగ్ కోసం భారీ సెట్ వేసిన 'ఆచార్య'

07-04-2021 Wed 17:14
  • భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'ఆచార్య'
  • హైదరాబాద్ శివార్లలో 'ధర్మస్థలి' సెట్
  • మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
Special set for charan song in acharya

చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చిరంజీవి - చరణ్ కాంబినేషన్లోని సన్నివేశాలను ఆల్రెడీ చిత్రీకరించారు. ఇక చరణ్ - పూజా హెగ్డే కాంబినేషన్ లోని ఒక డ్యూయెట్ ను కూడా ఇటీవల చిత్రీకరించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 9వ తేదీ నుంచి మొదలుపెడుతున్నారు. హైదరాబాద్ శివారులో వేసిన భారీ సెట్ లో ఈ షెడ్యూల్ షూటింగు మొదలవుతుంది. ఇక్కడ వేసిన 'ధర్మస్థలి' సెట్లో చరణ్ పై ఒక ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.

చరణ్ పాత్రకిగల నాయకత్వ లక్షణాలు .. ఆయన ఆశయసాధనకి సంబంధించిన ఉద్యమభావాలతో ఈ పాట సాగుతుందని అంటున్నారు. ఈ పాటను ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలపడానికి కొరటాల శివ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడని చెబుతున్నారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాట మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే పోర్షన్ పూర్తయిందట .. ఈ పాట చిత్రీకరణతో చరణ్ పోర్షన్ కూడా పూర్తవుతుందని చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో .. భారీ  తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా కోసం, మెగా అభిమానులంతా వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు.