ఎన్టీఆర్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

07-04-2021 Wed 14:06
  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ 
  • వాయిదా పడిందంటూ వార్తలు
  • 'అదొక జోక్' అని చెప్పిన నిర్మాత  
  • 'ఆర్ఆర్ఆర్' తర్వాత సెట్స్ కి ఖాయం
Clarity on NTR new movie

సినిమా రంగంలో రోజూ రకరకాల వార్తలు వస్తుంటాయి. వీటిలో కొన్ని వాస్తవమైతే, మరికొన్ని ఒట్టి పుకార్లని తేలిపోతుంది. పుకార్ల విషయంలో ఆయా వ్యక్తులు వెంటనే స్పందించి క్లారిటీ ఇస్తుంటారు. ఇప్పుడు కూడా అలాగే ఎన్టీఆర్ తో సినిమా నిర్మించనున్న ప్రముఖ నిర్మాత నాగవంశీ తమ సినిమా విషయంలో వివరణ ఇచ్చారు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడుగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి నిర్మాత నాగవంశీ సన్నాహాలు చేస్తున్న సంగతి విదితమే. దీనికి సంబంధించిన స్క్రిప్టు పని కూడా ఇప్పటికే పూర్తయింది. రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' పూర్తికాగానే ఎన్టీఆర్ ఈ కొత్త చిత్రం షూటింగులో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేశారు.

అయితే, గత రెండు రోజుల నుంచి ఈ చిత్రంపై రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ సినిమా వాయిదా పడిందనీ, త్రివిక్రమ్ తయారుచేసిన స్క్రిప్టు పట్ల ఎన్టీఆర్ పూర్తి సంతృప్తిగా లేడనీ.. ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇవి నిర్మాత నాగ వంశీ దృష్టికి వెళ్లడంతో ఆయన తమాషాగా స్పందించారు.

'ఇదో మంచి జోక్ లా వుందే..' అంటూ ఆయన ట్వీట్ చేస్తూ, ఆ ప్రచారంలో వాస్తవం లేదన్న విషయాన్ని అలా సరదాగా వివరించారు. అంటే, 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇక ఇది సెట్స్ కి వెళ్లడం ఖాయమన్నమాట. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీగా వున్నారు.