తనయుడిని హీరోగా చేస్తున్న తేజ!

07-04-2021 Wed 11:06
  • 'చిత్రం' సినిమాతో దర్శకుడిగా పరిచయం
  • సీక్వెల్ తో హీరోగా తనయుడి ఎంట్రీ
  • ఈ నెల 18న సెట్స్ పైకి
Teja is making his son as a hero in chitram sequel

తేజ .. మంచి సినిమాటోగ్రఫర్ .. అంతకుమించి మంచి దర్శకుడు. 'చిత్రం' సినిమాతో దర్శకుడిగా మారిన తేజ, టీనేజ్ లవ్ స్టోరీస్ విషయంలో కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. ఆ తరువాత అలాంటి మరెన్నో కథలు తెరపైకి రావడానికి కారకుడయ్యాడు. మొదటి నుంచి కూడా ప్రేమకథలను ఎక్కువగా చేస్తూ వచ్చిన తేజ, ఆ సినిమాల ద్వారా కొత్త కుర్రాళ్లను హీరోలుగా పరిచయం చేశాడు. అలాంటి తేజ ఈ సారి తన తనయుడిని హీరోగా చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇది  'చిత్రం' సినిమాకి సీక్వెల్ కావడం విశేషం.


దర్శకుడు తేజ ప్రస్తుతం గోపీచంద్ హీరోగా 'అలమేలుమంగ- వెంకటరమణ' సినిమాను రూపొందిస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఆయన తన తదుపరి సినిమాగా 'చిత్రం 1.1' సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బావమరిది 'నితిన్ చంద్ర' హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలో నిజం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమాతో తేజ తన తనయుడు 'అమితోవ్ తేజ'ను హీరోగా పరిచయం చేయనున్నాడని అంటున్నారు. ఈ నెల 18వ తేదీన షూటింగు మొదలు కానుంది. అందువలన ఆ రోజున స్పష్టత వచ్చే అవకాశం ఉంది.