తెలంగాణలో 9, 10 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం: వాతావరణశాఖ

07-04-2021 Wed 09:42
  • 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి
  • నేడు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం
  • నిన్న ఆదిలాబాద్‌లో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Rains in Telangana on 9th and 10th

వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ వాసులకు ఇది కొంచెం ఊరటనిచ్చే వార్తే. ఈ నెల 9, 10 తేదీల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా మరఠ్వాడా వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ రాష్ట్ర డైరెక్టర్ నాగరత్న తెలిపారు. నేడు, రేపు రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొన్నారు. నిన్న ఆదిలాబాద్‌లో గరిష్ఠంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్‌లో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు చెప్పారు.