వివేకానందరెడ్డి హత్యతో నాకు సంబంధం ఉందని తేలితే బహిరంగంగా ఉరితీయండి: ఆదినారాయణరెడ్డి

07-04-2021 Wed 08:35
  • జగన్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం
  • ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట ఇరు కుటుంబాలు ధర్నా చేయాలి
  • దోషులపై అక్కడే చర్యలు తీసుకోవాలి
If I am convicted in viveka murder you can hang me anywhere

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో తన ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలపై  ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి స్పందించారు. వివేకా 15 మార్చి 2019న అనుమానాస్పద స్థితిలో చనిపోయారని, ఆయన మృతిపై విచారణ జరుగుతోందని అన్నారు. జగన్ కుటుంబ సభ్యులు తనపై చేస్తున్న  ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపడేశారు. ఈ హత్యకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఉందని తేలితే కనుక తనను ఎక్కడైనా సరే బహిరంగంగా ఉరితీయొచ్చని అన్నారు. తనపై ఇంకా అనుమానం ఉంటే కనుక జగన్, వివేకా కుటుంబ సభ్యులు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలన్నారు. విచారణ ముగిసిన తర్వాత దోషులపై అక్కడే చర్యలు తీసుకోవాలని సూచించారు.