సర్పంచ్ నుంచి రూ. 5 లక్షల లంచం.. ఏసీబీ అధికారులు చూస్తున్నారని స్టవ్ పై కాల్చివేత!

07-04-2021 Wed 07:10
  • క్రషర్ ఏర్పాటుకు సర్పంచ్ దరఖాస్తు
  • క్రషర్ ఏర్పాటుకు రూ. 6 లక్షల లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్
  • తహసీల్దార్ పై మరికొందరు బాధితుల దాడి  
Man Burned Rs 6 Lakh To Escape From ACB

తాను లంచం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చూశారని భయపడిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 6 లక్షలను స్టవ్ పై పెట్టి కాల్చేశాడు. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండలో జరిగిందీ ఘటన.

మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కోరింట తండా సర్పంచ్ రాములు నాయక్ వెల్దండ మండలం బొల్లంపల్లి పంచాయతీ పరిధిలో 15 హెక్టార్ల స్థలంలో క్వారీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన జిల్లా మైనింగ్ శాఖ అధికారులు ఎన్‌వోసీ కోసం వెల్దండ తహసీల్దార్‌ సైదులుకు అప్పగించారు.

6 లక్షల రూపాయలు ఇస్తేనే క్రషర్ ఏర్పాటుకు అనుమతి ఇస్తానని తహసీల్దార్ సైదులు సర్పంచ్ రాములు నాయక్‌కు తేల్చి చెప్పాడు. రాములు రూ. 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులను కలిసి విషయం చెప్పాడు. వారి సూచన మేరకు నిన్న సాయంత్రం కల్వకుర్తిలోని మధ్యవర్తి వెంకటయ్య‌గౌడ్ ఇంటికి వెళ్లిన రాములు నాయక్ లంచం డబ్బులు అందించి బయటకు వచ్చాడు.

రాములు నాయక్ తనకు డబ్బులు ఇవ్వడం, తాను తీసుకోవడం వంటివన్నీ ఏసీబీ అధికారులు గమనిస్తున్నారన్న విషయాన్ని గ్రహించిన వెంకటయ్య‌గౌడ్ వెంటనే నగదు తీసుకుని వంట గదిలోకి వెళ్లి, ఆ రూ.5 లక్షలను స్టవ్‌పై పెట్టి కాల్చేశాడు. గమనించిన అధికారులు వెంటనే ఇంట్లోకి వెళ్లి స్టవ్‌ ఆఫ్ చేసి కాలుతున్న నోట్లపై నీళ్లు చల్లి ఆర్పారు. తహసీల్దార్ సైదులు, వెంకటయ్య‌గౌడ్ లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని సైదులు నివాసంలో సోదాలు నిర్వహించారు.

వెంకటయ్యగౌడ్‌ను కల్వకుర్తి నుంచి వెల్దండ తీసుకొస్తుండగా వేరే కేసుల్లోని రెవెన్యూ బాధితులు కొందరు ఆయనపై దాడిచేశారు. నిందితులు ఇద్దరినీ తహసీల్దార్ కార్యాలయంలో విచారిస్తుండగా కొందరు బయట ఆందోళనకు దిగారు. అలాగే, వెల్దండ బస్టాండ్ వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.