Inian economy: 2021లో భారత వృద్ధి రేటు 12.5 శాతం... అంచనా వేసిన ఐఎంఎఫ్‌

  • అనూహ్యంగా పుంజుకోనున్న భారత్‌
  • అత్యంత వేగంగా వృద్ధి చెందనున్న దేశం
  • చైనా కంటే కూడా మెరుగైన స్థితి
  • 2022లో 6.9 శాతం వృద్ధిరేటు
IMF Projects indias GDP at  above 12pc in 2021

2021లో భారత ఆర్థిక వ్యవస్థ 12.5 శాతం వృద్ధిరేటు నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) సంస్థ అంచనా వేసింది. అదే సమయంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2021లో 6 శాతం లెక్కన.. 2022లో 4.4 శాతం చొప్పున వృద్ధి చెందనుందని తెలిపింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్‌ మరోసారి తన పూర్వస్థితికి చేరుకోనుందని అభిప్రాయపడింది.

త్వరలో జరగనున్న ప్రపంచ బ్యాంకు సమావేశం ముందు ఐఎంఎఫ్‌ వార్షిక ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరు’పై నివేదిక విడుదల చేసింది. 2020లో మైనస్‌ ఎనిమిది శాతం క్షీణించిన భారత ఆర్థిక వ్యవస్థ 2021లో అనూహ్యంగా పుంజుకొని 12.5 శాతం, 2022లో 6.9 శాతం వృద్ధి రేటు నమోదు చేయనుందని స్పష్టం చేసింది.

ఇక 2020లో పాజిటివ్‌ వృద్ధి రేటు నమోదు చేసిన ఏకైక దేశం చైనా కంటే కూడా భారత జీడీపీ మెరుగైన స్థితిలో ఉండనుందని ఐఎంఎఫ్‌ తెలిపింది. 2021లో చైనా 8.6 శాతం, 2022లో 5.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ మాట్లాడుతూ.. ఇప్పటికీ అనేక దేశాలు కొవిడ్‌ సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయని తెలిపారు. అలాగే అనేక దేశాల్లో మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల విధానకర్తలు ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పర్యాటకంపై ఆధారపడిన దేశాలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నెమ్మదిగా సాగుతున్న దేశాలకు ఆర్థికపరమైన సవాళ్లు తప్పదని హెచ్చరించారు.

More Telugu News