18 ఏళ్ల పైబడిన వారందరికీ కరోనా టీకా ఇవ్వాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చిన కేంద్రం

06-04-2021 Tue 19:14
  • దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా
  • అందరికీ టీకా ఇవ్వాలని డిమాండ్‌
  • అలా చేస్తే కరోనా కట్డడి పక్కదారి పడుతుందన్న కేంద్రం
  • అందరికీ ఇప్పుడే టీకా ఇవ్వలేమని స్పష్టం
  • ముందు అవసరమున్న వారికి ఇవ్వడమే లక్ష్యం
centre said opening up vaccine to all is not Going to happen soon

దేశవ్యాప్తంగా కరోనా భారీ స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ కరోనా టీకా ఇవ్వాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే సైతం ఈ డిమాండ్‌కు మద్దతు పలికారు. అయితే, కేంద్రం మాత్రం ఈ డిమాండ్‌ను తోసిపుచ్చింది. ఇప్పుడే అందరికీ టీకా ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది.

కావాలనుకునే వారందరికీ టీకా ఇవ్వడం కంటే కరోనా ముప్పు ఉన్న వారికి తొలుత ఇవ్వడం తక్షణ అవసరం అని కేంద్రం స్పష్టం చేసింది. ‘‘ఎవరికైతే కరోనా ముప్పు అధికంగా ఉందో.. వారికి టీకా ఇవ్వాలన్నది లక్ష్యం. ఎవరు కావాలనుకుంటే వారికి టీకా ఇవ్వడం కంటే.. ఎవరికైతే అవసరముందో వారికి అందజేయడమే ప్రధాన లక్ష్యం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ  కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయిస్తే.. మహమ్మారి కట్టడి పక్కదారి పడుతుందని అభిప్రాయపడ్డారు.

దీనిపై నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ సైతం స్పందించారు. ఏ దేశంలోనూ 45 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి టీకా ఇవ్వడం లేదని తెలిపారు. ప్రస్తుతం కొవిడ్‌ కట్టడిపైనే దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అందరికీ టీకా ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రభుత్వమే ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.