అఖిల్ బర్త్ డే స్పెషల్ గా .. ఐదో సినిమా ఫస్టులుక్!

06-04-2021 Tue 18:25
  • ఈ నెల 8వ తేదీన అఖిల్ బర్త్ డే
  • దర్శకుడిగా సురేందర్ రెడ్డి
  • త్వరలోనే సెట్స్ పైకి  
Akhil next movie frist look will be released on his birthday

అఖిల్ అందగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు .. డాన్సులు చేయడంలో కూడా తన సత్తా చాటుకున్నాడు. కుర్రాళ్లలో ఆయనకి ఎంత ఇమేజ్ ఉందో .. అమ్మాయిల్లోనూ అంతే క్రేజ్ ఉంది. అఖిల్ ఇంతవరకూ నాలుగు సినిమాలు చేశాడు. వాటిలో మూడు సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. నాలుగో సినిమాగా ప్రేక్షకులను పలకరించడానికి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' రెడీ అవుతోంది. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా కనువిందు చేయనుంది.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' జూన్ 19వ తేదీన విడుదల కానుంది. ఈ లోగానే దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి అఖిల్ సిద్ధమవుతున్నాడు.  అనిల్ సుంకర - సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ నెల 8వ తేదీన అఖిల్ పుట్టిన రోజు .. ఆ సందర్భంగా ఆ రోజున ఉదయం 9:09 నిమిషాలకు ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు. హీరోలను స్టైలీష్ గా ప్రెజెంట్ చేయడంలో సురేందర్ రెడ్డి సిద్ధహస్తుడు. మరి అఖిల్ ను ఎలా చూపిస్తాడో .. ఆయన జోడిగా ఏ బ్యూటీని రంగంలోకి దింపుతాడో చూడాలి.