పార్లమెంటులో వైయస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తా: రఘురామకృష్ణరాజు

06-04-2021 Tue 17:58
  • వివేకాను గొడ్డలి పోటు పొడిచింది ఎవరు?
  • హత్య తర్వాత సీఐతో ఎంపీ ఏం మాట్లాడారు?
  • హత్య వెనుక బంధువులే ఉన్నారనే విషయం అర్థమవుతోంది
Will raise YS Vivekas murder issue in Parliament says Raghu Rama Krisha Raju

వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను గొడ్డలి పోటు పొడిచింది ఎవరని ఆయన ప్రశ్నించారు. ఆయన హత్యకు గురైన తర్వాత కట్లు కట్టింది ఎవరని, ఆ వైద్యులు ఎవరో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హత్య సమాచారం రాగానే స్థానిక సీఐతో ఎంపీ ఏం మాట్లాడారని అడిగారు.

సీబీఐ అధికారులతో ఓ ఎంపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏం మాట్లాడారని ప్రశ్నించారు. వివేకా హత్య వెనుక ఆయన బంధువులే ఉన్నారనే విషయం అర్థమవుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో వివేకా హత్య అంశాన్ని లేవనెత్తుతానని అన్నారు. తనపై కేసులు పెట్టాలంటూ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు  ఛైర్మన్ పై సీఎం జగన్, విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.