సంపూర్ణేష్ బాబు హీరోగా 'పుడింగి నెంబర్ 1'

06-04-2021 Tue 17:51
  • ఇద్దరు హీరోయిన్లతో సంపూ
  • కీలకమైన పాత్రలో పోసాని
  • జులైలో ప్రేక్షకుల ముందుకు    
Sampoornesh Babu started his new movie Pudingi Number 1

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదని అంటూ ఉంటారు. కానీ తమ టాలెంటును నమ్ముకుని వచ్చి కలబడి నిలబడిన ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు. ఆ జాబితాలో సంపూర్ణేశ్ బాబు పేరు కూడా బోల్డ్ లెటర్స్ లోనే కనిపిస్తుంది. అయితే, 'కొబ్బరి మట్ట' తరువాత ఆ స్థాయిలో ఆయన మరో సినిమా చేయలేదు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన ఆయన, తాజాగా మరోసారి హీరోగా ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరే 'పుడింగి నెంబర్ 1 '.

సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా ఈ రోజునే ఈ సినిమా హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కేఎస్ రామారావు క్లాప్ ఇవ్వగా .. భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేయగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇక పలు చిత్రాలలో హాస్యనటిగా మెప్పించిన విద్యుల్లేఖ రామన్ ఈ సినిమాతో కథానాయిక అవుతోంది. మరో కథానాయికగా సాఫీ కౌర్ పరిచయమవుతోంది. పోసాని ... అజయ్ ఘోష్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమా, ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగు జరుపుకోనుంది. జులైలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.