సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం అత్యంత బాధాకరం: చంద్రబాబు

06-04-2021 Tue 17:09
  • శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం 
  • ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న చంద్రబాబు
  • ఆలయాలపై దాడులపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్
Chandrababu demands CBI enquiry on Hindu gods idols vandalisation

ఏపీలోని హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం చేస్తున్న దారుణ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. జిల్లాలోని కుప్పం మండలం గోనుగూరు సమీపంలోని బేటగుట్టపై ఉన్న సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలోని విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం అత్యంత బాధాకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు.

'ఒకటా రెండా? వందల కొద్దీ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. విగ్రహ ధ్వంసం ఘటనలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐ విచారణ కోరాలి. రాష్ట్రంలో జరిగిన అన్ని ఘటనల్లో నిందితులను అరెస్ట్ చేయాలి' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.