ఏపీలో పరిషత్ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

06-04-2021 Tue 16:22
  • ఏపీలో ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
  • నోటిఫికేషన్ జారీ చేసిన నూతన ఎస్ఈసీ
  • హైకోర్టును ఆశ్రయించిన పలువురు 
  • కోడ్ పై 4 వారాల గడువు పాటించలేదని పిటిషన్
  • సుప్రీం ఉత్తర్వులు అమలు చేయలేదని ఆక్షేపణ
  • పిటిషనర్లతో ఏకీభవించిన హైకోర్టు
High Court stays Parishat Elections in AP

ఏపీలో ఈ నెల 8న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఇటీవల కొత్తగా ఎస్ఈసీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్నీ పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి.

కోడ్ విషయంలో నాలుగు వారాల గడువు పాటించలేదని పిటిషనర్లు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోడ్ విధించలేదని ఆక్షేపించారు. ఎస్ఈసీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. విచారణ సందర్భంగా పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడం సరికాదని ధర్మాసనం పేర్కొంది.

వాదనల సందర్భంగా... నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు కనీసం 4 వారాల సమయం అవసరమని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పిటిషనర్లు కోర్టు ముందుంచారు. అయితే ఇది గతంలోనే ఇచ్చిన నోటిఫికేషన్ అని, కొవిడ్ వల్ల ఆగిపోయిందని, దాన్నే కొనసాగిస్తున్నామని ఎస్ఈసీ, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నందున వాటిని అతిక్రమించరాదని జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం ఎస్ఈసీకి, ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశించింది.