పవన్ కల్యాణ్ ఏ ఒక్క అంశంలోనైనా నిలకడగా ఉన్నారా?: సజ్జల

06-04-2021 Tue 15:58
  • సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం
  • పవన్ తిరుపతి సభలో చేసిన వ్యాఖ్యలపై స్పందన
  • రాత్రి ఒకరితో, పగలు మరొకరితో తిరిగే నేత అని విమర్శలు
  • 2019కి ముందు, ఆ తర్వాత పవన్ లో స్థిరత్వంలేదని వెల్లడి
Sajjala questions Pawan Kalyans stability

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. తిరుపతిలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ కు ఒక్క అంశంలోనైనా నిలకడ ఉందా? అని ప్రశ్నించారు.

అంతేకాదు, రాత్రి ఒకరితో, పగలు మరొకరితో చెట్టాపట్టాలేసుకుని తిరిగే నాయకుడు అంటూ పవన్ ను ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత పవన్ మాట్లాడిన మాటలను పోల్చి చూస్తే ఒక్కదాంట్లోనూ స్థిరత్వం లేదన్న విషయం అర్థమవుతుందని సజ్జల విమర్శించారు.

"పవన్ తత్వమే అంతా? లేక, ఆయన సినిమా సినిమాకు అనేక డైలాగులు చెప్పడం వల్ల తనకంటూ సొంత అభిప్రాయం అనేది లేకుండా పోయిందా? ఆ పూటకు స్టేజిపై ఆవేశంగా కనిపించేందుకు ఏదో ఒకటి చెప్పడం పవన్ కు అలవాటైపోయింది. ఎత్తిచూపడానికి ఏమీ సమస్యలు లేకపోవడంతో అవాకులు చెవాకులు పేలుతున్నారు" అని మండిపడ్డారు.