Kapil Dev: అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ గా పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తికి కపిల్ దేవ్ మద్దతు!

Kapil Dev Supports Indian American Running For Virginia Lt Governor
  • వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ బరిలో పునీత్ అహ్లువాలియా
  • అమెరికాకు వచ్చి సహాయం చేస్తానన్న కపిల్
  • 1990లో అమెరికాకు వలస వెళ్లిన పునీత్
అమెరికాలోని వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ బరిలో ఉన్న భారత సంతతి వ్యక్తి పునీత్ అహ్లువాలియాకు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తన మద్దతును ప్రకటించారు. పునీత్ కు ఆల్ ది బెస్ట్ చెపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు... అక్కడకు స్వయంగా వచ్చి మీకు సహాయం చేయాలని ఆశిస్తున్నానని చెప్పారు. తనకు కపిల్ మద్దతు పలకడంపై పునీత్ సంతోషం వ్యక్తం చేశారు. కపిల్ కు ధన్యవాదాలు తెలిపారు. గొప్ప క్రికెటర్, తన ప్రియ మిత్రుడు తనకు మద్దతు తెలపడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.

రిపబ్లికన్ పార్టీ తరపున పునీత్ ఎన్నికల బరిలో నిలిచారు. మే 8న జరగనున్న హైబ్రిడ్ సదస్సులో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి నామినీని ఎంపిక చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ గా ఆయన ఎంపికైతే... ఆ రాష్ట్రంలో అత్యున్నత పదవిని పొందిన తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కుతారు.

55 ఏళ్ల పునీత్ ఢిల్లీకి చెందినవారు. 1990లో అమెరికాకు వలస వెళ్లారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన భార్య నదియాది ఆఫ్ఘనిస్థాన్. వర్జీనియాలో గత దశాబ్ద కాలంగా భారతీయ అమెరికన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. క్రికెట్ ను అమితంగా ఇష్టపడే దక్షిణాసియా దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. స్థానిక క్రికెట్ క్లబ్ లు అక్కడ ఎన్నో ఉన్నాయి. యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా 2019 అంచనాల ప్రకారం వర్జీనియా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ఏసియన్ అమెరికన్లు నివసిస్తున్నారు.
Kapil Dev
Team India
Puneet Ahluwalia
Virginia
Lieutenant Governor
USA

More Telugu News