సీబీఐ కేసును జగన్ వెనక్కి తీసుకోవడం విజయమ్మకి కనిపించలేదా?: టీడీపీ నేత పట్టాభి

06-04-2021 Tue 14:56
  • ఈ నాటి గాంధారి విజయమ్మ
  • కళ్లకు గంతలు తీసేసి మాట్లాడాలి
  • సునీత ఆరోపణలు కనిపించడం లేదా? 
  • సాక్షి మీడియాలో సునీత గళాన్ని వినిపించారా?
TDP leader Pattabhi calls YS Vijayamma as Gandhari

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మపై టీడీపీ నేత పట్టాభి విమర్శలు గుప్పించారు. ఆమెను ఈనాటి గాంధారిగా ఆయన అభివర్ణించారు. జగన్ సీఎం అయిన తర్వాత వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని కేసును వెనక్కి తీసుకున్న విషయం విజయమ్మకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. విజయమ్మ కళ్లకు గంతలు తీసేసి మాట్లాడాలని అన్నారు.

 వైయస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్ లో పేర్కొన్నట్టు... సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు తీసుకున్న చర్యలు విజయమ్మకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు దోషులను కాపాడేందుకు జగన్ పదేపదే సిట్ ను మార్చాలని ప్రయత్నించిన విషయాన్ని సునీత లేవనెత్తారని... ఆ విషయం విజయమ్మకు తెలియదా? అని నిలదీశారు.  

తన తండ్రి హత్య కేసులో వైయస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపై సునీత చేసిన ఆరోపణలు విజయమ్మకు కనిపించడం లేదా? అని పట్టాభి ప్రశ్నించారు. వీరిద్దరికీ ఢిల్లీలో పదవులను జగన్ ఎందుకు కట్టబెట్టారో విజయమ్మ చెప్పాలని డిమాండ్  చేశారు. తమకు అందరి మద్దతు ఉందని విజయమ్మ చెపుతున్నారని... ఏ ఒక్కరోజైనా సాక్షి మీడియాలో సునీత గళాన్ని వినిపించారా? అని ప్రశ్నించారు. కోడికత్తి డ్రామాలో పాత్రధారులైన ఇద్దరు తెలంగాణ వైద్యులకు ఏపీలో కీలక పదవులను ఎందుకిచ్చారని నిలదీశారు. సొంత చెల్లెలికే వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్ దని దుయ్యబట్టారు.