నెల రోజులు నడవకూడదు కాబట్టి ప్రచారానికి రాలేకపోయాను: రోజా

06-04-2021 Tue 13:48
  • ఇటీవల రోజాకు చెన్నైలో మేజర్ ఆపరేషన్లు
  • తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న రోజా
  • ఈ నెల 8న ఏపీలో పరిషత్ ఎన్నికలు
  • వైసీపీని తిరుగులేని మెజారిటీతో గెలిపించాలని పిలుపు
  • జగనన్నకు మరోసారి కానుక ఇద్దామని వ్యాఖ్యలు
Roja explains her health condition

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇటీవల చెన్నైలో శస్త్రచికిత్సలు చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన నివాసంలో కోలుకుంటున్నారు. ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎల్లుండి జరగనున్న నేపథ్యంలో రోజా ఓ వీడియో సందేశం వెలువరించారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా తనకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు అంటూ రోజా పేర్కొన్నారు.

తన ఆరోగ్య పరిస్థితి కారణంగా నెలరోజులు నడవకూడదని, అందుకే ప్రచారానికి రాలేకపోయానని వెల్లడించారు. అయితే ప్రతి ఒక్కరూ వైసీపీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగనన్న పాలనకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి ఏవిధంగా జగనన్నకు కానుక ఇచ్చారో, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లోనూ అదే విధంగా వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు మరింత ఘనమైన కానుక ఇవ్వాలని రోజా సూచించారు.

ఏ నమ్మకంతో అయితే మనమందరం రెండేళ్ల కిందట జగనన్నను ముఖ్యమంత్రిని చేశామో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న వ్యక్తి జగనన్న అని, దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రి అనిపించుకున్నారని రోజా కొనియాడారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి అయినా, జడ్పీటీసీ అభ్యర్థి అయినా జగనన్నే అని, జగనన్న పరిపాలనకు మద్దతుగా ఓటు వేస్తున్నట్టే భావించాలని అన్నారు.