కమల్ 'విక్రమ్' సినిమాలో విజయ్ సేతుపతి?

06-04-2021 Tue 13:00
  • 'భారతీయుడు 2'తో పాటు 'విక్రమ్' సినిమా  
  • 'విక్రమ్'కు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం   
  • ప్రాజక్టు నుంచి తప్పుకున్న లారెన్స్ 
  • విజయ్ సేతుపతితో సంప్రదింపులు
Vijay Setupati to play villain in Vikram

ఓపక్క సినిమాలలో నటిస్తూనే... మరోపక్క కమలహాసన్ రాజకీయాలలోకి కూడా  దిగిన సంగతి విదితమే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో తను పోటీచేయడమే కాకుండా..  తన పార్టీ తరపున పెద్ద ఎత్తున అభ్యర్థులను సైతం గోదాలోకి దించాడు.

ఇదిలావుంచితే, ఈ ఎన్నికల ప్రకటనకు ముందే కమల్ 'భారతీయుడు' సీక్వెల్ తో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'విక్రమ్' అనే సినిమాని కూడా కమిట్ అయ్యాడు. 'భారతీయుడు' సగం వరకు షూటింగు జరుపుకుని, దర్శక నిర్మాతల మధ్య అభిప్రాయభేదాల కారణంగా నిలిచింది.

ఇక లోకేశ్ కనగరాజ్ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను కూడా గతంలోనే రిలీజ్ చేశారు. అయితే, ఈలోగా ఎన్నికల ప్రకటన రావడంతో దీనిని కూడా తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఈ గ్యాప్ లో దర్శకుడు లోకేశ్ ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నాడు. ఇందులో ప్రధాన విలన్ పాత్రలో లారెన్స్ నటిస్తాడంటూ ఆమధ్య వార్తలు వచ్చినప్పటికీ, ఆయన ఈ ప్రాజక్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఆ పాత్రకు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల తర్వాత కమల్ రాజకీయ కార్యకలాపాలను బట్టి ఈ చిత్రం సెట్స్ కి వెళుతుంది.