తమిళనాడులో జోరుగా సాగుతున్న పోలింగ్.. క్యూలో నిల్చుని ఓటేసిన తెలంగాణ గవర్నర్

06-04-2021 Tue 10:36
  • ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖులు
  • ఓటేసిన విజయ్, సూర్య, కార్తి, అజిత్, షాలిని
  • కేరళలో ఓటుహక్కు వినియోగించుకున్న మెట్రోమ్యాన్
Telangana Governor Tamilisai cast her vote in Tamil Nadu

తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఈ ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువతీయువకులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే చీఫ్ స్టాలిన్, ఆయన భార్య, కుమారుడు ఉదయనిధితో కలిసి తేనాంపేటలోని సైట్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విరుకం బాకంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న గవర్నర్ క్యూలో తన వంతు వచ్చే వరకు వేచి చూశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం శివగంగ జిల్లా కందనూరులోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటేశారు.

కోలీవుడ్ నటులు విజయ్, సూర్య, కార్తి తదితరులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేశారు. అజిత్ తన భార్య షాలినితో కలిసి ఓటేశారు. అలాగే, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఉదయాన్నే థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరిస్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటేయగా, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమలహాసన్ తన కుమార్తెలు అక్షర హాసన్, శ్రుతిహాసన్‌తో కలిసి వచ్చి తేనాంపేటలోని చెన్నై స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఇక, కేరళలో బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీధరన్ తన భార్యతో కలిసి వెల్లేరి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.