తెలంగాణలో నిన్న 1,498 కరోనా కేసుల నమోదు .. ఆరుగురి మృత్యువాత

06-04-2021 Tue 10:12
  • నిన్న 62,350 మందికి కరోనా పరీక్షలు 
  • 1,729కి చేరిన మరణాల సంఖ్య
  • జీహెచ్ఎంసీ పరిధిలో 313 కేసులు
six dead due to corona in telangana

తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. నిన్న ఏకంగా 1,498 కేసులు నమోదు కాగా, ఆరుగురు మరణించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కొద్దిసేపటి క్రితం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735కు పెరగ్గా, మొత్తం మరణాల సంఖ్య 1,729కి చేరుకుంది.

అలాగే, 3,03,013 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9,993 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీరిలో 5,323 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 62,350 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిన్న 313 కేసులు వెలుగుచూశాయి.