Sattenpalli: స్వస్థలాలకు చేరిన అమర జవాన్ల భౌతికకాయాలు.. కాసేపట్లో అంత్యక్రియలు!

CRPF Jawans Muralikrishna and Jagadeesh dead bodies reached villages
  • బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో అమరులైన మురళీకృష్ణ, జగదీశ్
  • సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో మురళీకృష్ణ భౌతికకాయానికి  నివాళులు
  • జగదీశ్ అమర్ రహే అంటూ మార్మోగిన విజయనగరం
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో అమరుడైన సీఆర్‌పీఎఫ్ జవాను శాఖమూరి మురళీకృష్ణ మృతదేహం సత్తెనపల్లికి చేరుకుంది. అక్కడి పోలీస్ స్టేషన్‌లో భౌతికకాయానికి పోలీసులు నివాళులు అర్పించారు. మురళీకృష్ణ మృతదేహాన్ని మరికాసేపట్లో ఆయన స్వగ్రామం అయిన గుడిపూడికి తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు ప్రముఖులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

మరోవైపు, ఇదే ఘటనలో అసువులు బాసిన విజయనగరంలోని గాజులరేగకు చెందిన సీఆర్‌పీఎఫ్ కోబ్రా కమాండర్ రౌతు జగదీశ్ (27) భౌతికకాయం నిన్న స్వగృహానికి చేరుకుంది. సాయంత్రం ఏడు గంటల సమయంలో ప్రత్యేక వాహనంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు జగదీశ్ పార్థివదేహాన్ని తీసుకొచ్చాయి.

పలువురు యువకులు, జగదీశ్ స్నేహితులు, కుటుంబ సభ్యులు త్రివర్ణపతాకాలు చేబూని జేఎన్‌టీయూ కూడలి నుంచి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా కలెక్టరేట్, ఎన్‌సీఎస్ థియేటర్, గాజులరేగ రైల్వే వంతెన మీదుగా వాహనాన్ని తీసుకొచ్చారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పార్థివదేహంపై పూలు చల్లుతూ ఇంటికి చేర్చారు. 'జగదీశ్ అమర్ రహే' అంటూ నినాదాలు చేశారు. నేడు అధికారిక లాంఛనాలతో జగదీశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Sattenpalli
Vizianagaram
CRPF
Jawan

More Telugu News