థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటేసిన రజనీకాంత్.. తేనాంపేటలో కమలహాసన్

06-04-2021 Tue 08:11
  • పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్
  • తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు
  • అసోం, పశ్చిమ బెంగాల్‌లో మూడో విడత పోలింగ్
Rajinikanth and Kamal Haasan Cast their votes

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 234 స్థానాలకూ నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,998 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 88,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలోని స్టెల్లా మేరీస్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ తన కుమార్తెలు అక్షర హాసన్, శ్రుతి హాసన్‌లతో కలిసి చెన్నైలోని తేనాంపేట హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, పుదుచ్చేరిలోనూ నేడు ఎన్నికలు జరగుతుండగా, అసోం, పశ్చిమ బెంగాల్‌లలో మూడో విడత  పోలింగ్ జరుగుతోంది.