Dassault: రాఫెల్ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు: కథనం ప్రచురించిన ఫ్రాన్స్‌ 'మీడియాపార్ట్'‌

  • రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం
  • 2016లో డసో ఏవియేషన్‌తో ఒప్పందం ఖరారు
  • దేశీయ భాగస్వామిగా డెఫ్‌సిస్‌
  • డెఫ్‌సిస్‌కు 1.1 మిలియన్‌ యూరోలు చెల్లించినట్లు ఆరోపణ
  • నమూనాల తయారీకేనని డసో వివరణ
  • ఆధారాలు లేవన్న ఫ్రాన్స్‌ దర్యాప్తు సంస్థ
In Rafale Deal Dassault Paid 1 Million Euros To Indian Company

అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 14 విమానాలు మన దేశానికి చేరగా మరికొన్ని త్వరలో అందనున్నాయి. అయితే, ఈ కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగినట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఆన్ లైన్ పత్రిక 'మీడియాపార్ట్‌' కథనం ప్రచురించింది.

ఆ పత్రిక కథనం ప్రకారం... రాఫెల్ విమానాల తయారీ సంస్థ డసో ఏవియేషన్‌ భారత్‌లో ఓ మధ్యవర్తికి చెందిన కంపెనీకి 1.1 మిలియన్‌ యూరోలు చెల్లించింది. 2016లో కుదిరిన ఈ కొనుగోలు ఒప్పందం విషయంలోనే ఈ చెల్లింపులు జరిగినట్లు మీడియాపార్ట్‌ స్పష్టం చేసింది. ఆ సదరు వ్యక్తి మరో రక్షణ ఒప్పందంలో ఇప్పటికే దర్యాప్తు సంస్థల విచారణ ఎదుర్కొంటున్నాడని తెలిపింది.  ఫ్రాన్స్‌కు చెందిన అవినీతి నిరోధక సంస్థ(ఏఎఫ్‌ఏ) జరిపిన తనిఖీల్లో ఈ విషయం బయటపడినట్లు పేర్కొంది.

దీనిపై డసోను ఆశ్రయించగా.. రాఫెల్ విమానాల నమూనాలను తయారుచేయడానికే ఆ సొమ్ము చెల్లించినట్లు వివరణ ఇచ్చింది. ఈమేరకు సాక్ష్యంగా భారత్‌లోని డెఫ్‌సిస్‌ అనే సంస్థ ఇచ్చిన ఇన్వాయిస్‌లను డసో చూపించింది. కానీ, అట్లాంటి నమూనాలుగానీ, కనీసం వాటికి సంబంధించిన ఫొటోలను కూడా ఇవ్వలేకపోయిందని ఏఎఫ్‌ఏ తెలిపింది .

డెఫ్‌సిస్‌ అనే భారత సంస్థ రాఫెల్ ఒప్పందంలో డసోకు దేశీయ భాగస్వామి. ఇది గుప్తా ఫ్యామిలీకి చెందిన సంస్థ. దీని ప్రమోటర్‌ సుషేన్‌ మోహన్‌ గుప్తాను అగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 2019లో అరెస్ట్‌ చేసింది. 170 మంది ఉద్యోగులు గల ఈ సంస్థకు యుద్ధ విమానాల నమూనాలను తయారుచేసే అనుభవం ఏమాత్రం లేదని ఏఎఫ్‌ఏ నివేదిక పేర్కొంది.

More Telugu News