అందాల కృతి శెట్టికి అప్పుడే మహేశ్ జోడిగా ఛాన్సా?

05-04-2021 Mon 18:24
  • 'ఉప్పెన' సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్
  • నాని సరసన రెండవ సినిమా
  • రామ్ జోడిగాను అవకాశం    

Anil Ravipudi will do his next film with mahesh babu nad kruthi shetty

తెలుగులో ఇప్పుడు కృతి శెట్టి ఓ పేరు కాదు .. ఓ మంత్రమై పోయింది. కుర్రాళ్లంతా ఇప్పుడు ఈ పిల్ల పేరునే కలవరిస్తున్నారు. తమ కలల వాకిట్లో కట్టేసుకుంటున్నారు. ఈ మధ్య సంచలన విజయాన్ని సాధించిన ప్రేమకథా చిత్రం ద్వారా పిప్పరమెంటులాంటి ఈ పిల్ల పరిచయమైంది. తెరపై ఈ అమ్మాయిని చూడగానే కుర్రాళ్లంతా గుండె గదులను ఖాళీ చేసి లీజుకి ఇచ్చేశారు. సొట్టబుగ్గలతో ఈ అమ్మాయి చందమామకి చెల్లిలా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంతగా కుర్రకారును ప్రభావితం చేసిన హీరోయిన్ లేదు. తొలి సినిమాతోనే థియేటర్స్ కి ఈ రేంజ్ లో ఆడియన్స్ ను రప్పించిన వాళ్లు లేరు.


తొలి సినిమా విడుదల కాకముందే నాని .. సుధీర్ బాబు వంటి హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిందంటే ఈ అమ్మాయికి ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. యువ హీరోలంతా కూడా తమ సినిమాల్లో ఈ అమ్మాయిని బుక్ చేసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అలా రామ్ - లింగుస్వామి సినిమాలోనూ ఈ అమ్మాయి ఛాన్స్ పట్టేసింది.

ఇక మహేశ్ బాబు జోడీగా మెరిసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయనే టాక్ జోరుగా వినిపిస్తోంది. రాజమౌళితో ప్రాజెక్టుకు ముందు అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి మహేశ్ బాబు ఆసక్తిని చూపుతున్నాడట. ఆ సినిమా కోసం ఈ అమ్మాయిని సంప్రదిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే అదృష్టాన్ని ఈ అమ్మాయి దత్తత చేసుకుందనే అనుకోవాలి.