మళ్లీ మెగా కలయిక... చిరంజీవి, చరణ్ తో పాన్ ఇండియా మూవీ?

05-04-2021 Mon 18:13
  • చిరంజీవి 'ఆచార్య'లో చరణ్ కీలక పాత్ర 
  • శంకర్ దర్శకత్వంలో చరణ్ భారీ ప్రాజెక్ట్
  • పాన్ ఇండియా మూవీగా నిర్మాణం  
  • చరణ్ కు తండ్రి పాత్రలో మెగాస్టార్  
Chiranjeevi and Charan together act in another movie

ఇద్దరు స్టార్ హీరోలు కలసి ఒక సినిమాలో నటిస్తేనే దానికి విపరీతమైన క్రేజ్ వస్తుంది.. అలాంటిది తండ్రీ కొడుకులైన మెగాస్టార్, రామ్ చరణ్ కలసి నటిస్తే ఇక ఆ క్రేజ్ చెప్పేక్కర్లేదు. గతంలో రామ్ చరణ్ నటించిన 'మగధీర', 'బ్రూస్ లీ' చిత్రాలలో చిరంజీవి చిన్న గెస్ట్ పాత్రలలో నటించిన సంగతి విదితమే. తాజాగా చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే, త్వరలో వీరిద్దరూ కలసి మరో పాన్ ఇండియా సినిమాలో హీరోలుగా నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి.

ప్రముఖ దక్షిణాది దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి. ఇక ఇందులో చిరంజీవి కూడా నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో  చరణ్ కి తండ్రిగా కీలక పాత్రను మెగాస్టార్ పోషిస్తారని తెలుస్తోంది.

ఒకవేళ ఇదే కనుక వాస్తవమైతే, మెగా ఫ్యాన్స్ కి ఇక పండగే అని చెప్పచ్చు. త్వరలోనే తమ ఆరాధ్య నటులను 'ఆచార్య' సినిమాలో చూడనున్న మెగా అభిమానులు.. మరికొన్నాళ్లకే మళ్లీ వీరిద్దర్నీ పాన్ ఇండియా మూవీలో కూడా చూస్తారన్న మాట!