హరిరామజోగయ్యలో ఇప్పటికీ ప్రజాసేవ కాంక్ష జ్వలిస్తూనే ఉంది: పవన్ కల్యాణ్

05-04-2021 Mon 17:31
  • నేడు హరిరామజోగయ్య జన్మదినం
  • 85 వసంతాలు నిండాయన్న పవన్
  • జనసేనకు ఇప్పటికీ మంచి సలహాలు ఇస్తూనే ఉన్నారని వివరణ
  • ఆయనకు సంపూర్ణ ఆయుష్షు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు వెల్లడి
Pawan Kalyan wishes Hariramajogaiah on his birthday

సీనియర్ రాజకీయనేత హరిరామజోగయ్య నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు నేటితో 85 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 85 వసంతాలు నిండినా హరిరామజోగయ్యలోని ప్రజాసేవ కాంక్ష నిరంతరం జ్వలిస్తూనే ఉందని కొనియాడారు. జనసేన ప్రగతి కోసం ఆయన తన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎన్నో మంచి సలహాలు ఇస్తూనే ఉన్నారని కితాబునిచ్చారు.

పట్టుమని పాతికేళ్లు నిండకుండానే ఆయన పంచాయతీ సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని, ఆయనలోని రాజకీయ చైతన్యానికి, ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలన్న బలమైన సంకల్పానికి అది నిదర్శనమని పవన్ కల్యాణ్ వివరించారు. ఆపై జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా అనేక రూపాల్లో ప్రజాసేవ చేశారని, నిజాయతీపరుడైన నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయనకు సంపూర్ణ దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.