SVBC: అశ్లీల చిత్రాల వ్యవహారంలో మరో ముగ్గురు ఎస్వీబీసీ ఉద్యోగులపై వేటు

  • భక్తుడికి అశ్లీల వీడియో లింకు పంపిన చానల్ ఉద్యోగి
  • టీటీడీకి ఫిర్యాదు చేసిన భక్తుడు
  • విచారణకు ఆదేశించిన టీటీడీ చైర్మన్
  • గతంలో ఏడుగురి సస్పెన్షన్
  • తాజాగా చానల్ ఎడిటర్ పైనా వేటు
Suspension on three SVBC employees

తిరుమల వెంకన్న భక్తి చానల్ ఎస్వీబీసీలో అశ్లీల చిత్రాల వ్యవహారానికి సంబంధించి మరో ముగ్గురిపై వేటు పడింది. ఎస్వీబీసీ ఎడిటర్ కృష్ణారావు, చానల్ మేనేజర్లు మురళీకృష్ణ, సోమశేఖర్ లను సస్పెండ్ చేశారు. ఎస్వీబీసీ అశ్లీల చిత్రాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటివరకు 10 మందిపై వేటు పడినట్టయింది. ఉద్యోగాల నుంచి తొలగించిన ఉద్యోగుల కంప్యూటర్లలో అశ్లీల దృశ్యాలతో కూడిన వీడియోలు ఉన్నట్టు సైబర్ సెక్యూరిటీ విజిలెన్స్ విభాగం గుర్తించింది.

గతంలో ఓ భక్తుడు ఎస్వీబీసీ చానల్లో ప్రసారమయ్యే 'శతమానం భవతి' కార్యక్రమానికి ఈమెయిల్ పంపాడు. అయితే ఆ భక్తుడికి కార్యక్రమానికి సంబంధించిన సమాచారం అందించాల్సిన ఎస్వీబీసీ ఉద్యోగి ఎంతో నిర్లక్ష్యపూరితంగా ఓ అశ్లీల వీడియో లింకు పంపాడు. దాంతో ఆ భక్తుడు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైవీ విచారణకు ఆదేశించారు. చానల్లోని పలువురు కీలకస్థానాల్లో ఉన్న ఉద్యోగులు విధి నిర్వహణ సమయంలో అశ్లీల చిత్రాలు చూస్తున్నట్టు గుర్తించి, అప్పట్లోనే కొందరికి ఉద్వాసన పలికారు.  

More Telugu News