వ్యాక్సిన్ వేయించుకున్నాను కాబట్టే కరోనా ప్రభావం నాపై స్వల్పంగా ఉంది: అల్లు అరవింద్

05-04-2021 Mon 16:17
  • అల్లు అరవింద్ కు కరోనా పాజిటివ్
  • వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా కరోనా వచ్చిందంటూ ప్రచారం
  • ఒక డోసు వేయించుకుని ఊరెళ్లానన్న అరవింద్ 
  • వ్యాక్సిన్ వేయించుకోని మిత్రుడు ఆసుపత్రి పాలయ్యాడని వివరణ
Allu Aravind clarifies on corona positive

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా పాజిటివ్ అని వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై అల్లు అరవింద్ స్పందించారు. జరుగుతున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందని అన్నారు.

"ఇటీవల కరోనా వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్నాక, ముగ్గురు స్నేహితులం ఊరెళ్లాం. తిరిగొచ్చిన తర్వాత నాకు, మరో వ్యక్తికి స్వల్పంగా జ్వరం వచ్చింది. మరో మిత్రుడు ఆసుపత్రిపాలయ్యాడు. వ్యాక్సిన్ తీసుకున్న నేను, మరో వ్యక్తి తేలికపాటి జ్వరానికి గురయ్యాం. వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తి మాత్రం ఆసుపత్రిలో చేరాడు.

దీన్ని బట్టి నేను చెప్పేదేంటంటే... వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల ప్రాణహాని ఉండదు. కరోనా ప్రభావం కూడా మనిషి శరీరంపై ఏమంత ఎక్కువగా ఉండదు. వైరస్ వచ్చి పోతుందంతే. వ్యాక్సిన్ వేయించుకోబట్టే నాకు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరంలేకపోయింది. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోండి. అప్పుడు కరోనా వచ్చినా ఏమీ చేయదు" అని వివరించారు. ఈ మేరకు అల్లు అరవింద్ ఓ వీడియో విడుదల చేశారు.