ఓ టైలర్ కొడుకునైన నాకు పవన్ సినిమా చేసే అవకాశం రావడం అదృష్టం: వేణు శ్రీరామ్

05-04-2021 Mon 12:40
  • 'దిల్' రాజుగారు ఈ ప్రాజెక్టును అప్పగించారు
  • త్రివిక్రమ్ గారు పిలవగానే ఆయన ఇంటికి వెళ్లాను.
  • అక్కడ పవన్ కల్యాణ్ గారిని చూసి ఆశ్చర్యపోయాను
  • హిమాలయాల్లోని ప్రశాంతత ఆయన వద్ద పొందాను  
Venu Sri Ram Compared Pawan Kalyan With Himalayas

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కథానాయకుడిగా 'వకీల్ సాబ్' సినిమా రూపొందింది. నివేదా థామస్ .. అంజలి .. అనన్య ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన థియేటర్లకు రానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ సందర్భంగా ఈ స్టేజ్ పై వేణు శ్రీరామ్ మాట్లాడుతూ, " ఈ ప్రాజెక్టును 'దిల్' రాజుగారు నాకు అప్పగించినప్పుడు చాలా సంతోషం కలిగింది. పవన్ చేసే అవకాశం ఉందని అన్నప్పుడు మరింత ఆనందంతో పొంగిపోయాను. త్రివిక్రమ్ ద్వారా పవన్ కల్యాణ్ గారిని కలవాల్సి వచ్చింది. త్రివిక్రమ్ గారు కాల్ చేయగానే ఆయన ఇంటికి వెళ్లాను.

త్రివిక్రమ్ గారు నన్ను వెంటబెట్టుకుని పవన్ కల్యాణ్ గారి దగ్గరికి తీసుకువెళతారేమోనని అనుకున్నాను. కానీ త్రివిక్రమ్ గారి రూమ్ లో ఆరడుగుల సజీవ కటౌట్ ను చూశాను .. ఆ కటౌట్ పేరే పవన్ కల్యాణ్. ఆయన అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చుని కనిపించారు.

చిన్నప్పుడు నేను హిమాలయాలను గురించి విన్నాను. ఆ తరువాత ఓ సారి షూటింగ్ కోసం వెళ్లినప్పుడు హిమాలయాలను దగ్గరగా చూశాను. పవన్ కల్యాణ్ గారిని మూడు అడుగుల దూరంలో చూసినప్పుడు నాకు హిమాలయాలు గుర్తుకు వచ్చాయి. హిమాలయాల్లోని ప్రశాంతత ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు నాకు లభించింది. ఒక మామూలు టైలర్ కొడుకునైన నాకు పవన్ సినిమా చేసే అవకాశం రావడం నేను చేసుకున్న అదృష్టం" అని చెప్పుకొచ్చాడు.