కరోనా విలయం... ఆరంభంలోనే కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు!

05-04-2021 Mon 10:16
  • ఇండియాలో తొలిసారిగా లక్షకు పైగా కరోనా కేసులు
  • ఆరంభంలోనే రెండు శాతం నష్టపోయిన సెన్సెక్స్
  • అమ్మకాల దిశగా ఇన్వెస్టర్లు
Huge Loss in Early Stock Market Trade in India

ఇండియాలో కరోనా కేసుల ఆల్ టైమ్ రికార్డు నమోదు కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ హరించింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలు ఏర్పడటం కూడా తోడవడంతో సోమవారం నాటి సెషన్ ఆరంభంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు కుప్పకూలాయి. కీలకమైన మద్దతు స్థాయుల వద్ద కూడా సెన్సెక్స్ కొనుగోళ్లను పొందలేకపోయింది. ఫలితంగా గంట వ్యవధిలోనే ఇన్వెస్టర్లు దాదాపు రూ. 3 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు.

ఈ ఉదయం 10.15 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 990 పాయింట్లకు పైగా నష్టపోయి 1.90 శాతం వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 260 పాయింట్లకు పైగా పడిపోయి 1,80 శాతం వద్దా కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్-50.. 1.65 శాతం, నెక్స్ట్ 50, 1.23 శాతం నష్టపోయాయి.

సెన్సెక్స్ 30లో ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్ మాత్రమే ఒక శాతం వరకూ లాభాల్లో నడుస్తుండగా, మిగతా కంపెనీలన్నీ ఐదు శాతం వరకూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదిలావుండగా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా సాగాయి. సెట్ కాంపోజిట్ 0.93 శాతం, జకార్తా కాంపోజిట్ 0.46 శాతం నష్టపోగా, మిగతా సూచికలు ఒకటిన్నర శాతం వరకూ లాభాలను నమోదు చేశాయి.

ఇండియాలో తొలిసారిగా రోజువారీ కరోనా కేసులు లక్ష మార్క్ ను అధిగమించడం ఇన్వెస్టర్లపై అమ్మకాల దిశగా ఒత్తిడి పెంచిందని మార్కెట్ పండితులు అంచనా వేశారు. కేసులు పెరుగుతుండటంతో పాటు, ఒక్కో రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితులు మరోసారి ఏర్పడుతుండటం, ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఇప్పటికే వారాంతపు లాక్ డౌన్ ను ప్రకటించడం కూడా మార్కెట్ పై ప్రభావం చూపిందని విశ్లేషించారు.