Yanam: కనిపించకుండా పోయిన యానాం ఇండిపెండెంట్... అపస్మారక స్థితిలో కాకినాడలో ప్రత్యక్షం!

  • బీజేపీ యానాం అధ్యక్షుడిగా పనిచేసిన దుర్గా ప్రసాద్
  • టికెట్ దక్కక పోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
  • గురువారం నుంచి కనిపించకుండా పోయిన దుర్గా ప్రసాద్
Yanam Independent Candidate Appears in Kakinada

నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన యానాం ఇండిపెండెంట్ అభ్యర్థి పెమ్మాడి దుర్గా ప్రసాద్, కాకినాడలో నిన్న రాత్రి రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడివుండటం కలకలం రేపింది. ఇక్కడికి సమీపంలోని అచ్చంపేట కూడలి వద్ద దుర్గా ప్రసాద్ ను గుర్తించిన స్థానికులు అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా, వైద్య సిబ్బంది వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం దుర్గా ప్రసాద్ స్పృహలో లేకపోవడంతో అతనికి ఆక్సిజన్ ను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగంగా ఉన్న యానాంలో పోటీ చేస్తున్న అభ్యర్థి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించగా, ఆయన్ను ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అపహరించారని కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో పుదుచ్చేరి నుంచి ప్రత్యేకంగా వచ్చిన సీనియర్ ఎస్పీ రాహుల్ ఆల్వాల్ విచారణ ప్రారంభించారు కూడా.

గతంలో దుర్గా ప్రసాద్ యానాం బీజేపీ అధ్యక్షుడిగానూ పని చేశారు. పట్టణంలోని అన్యం గార్డెన్స్ లో ఉన్న ఓ అపార్టుమెంట్ లో నివాసం ఉంటున్న ఆయన, యానాం బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించి విఫలం అయ్యారు. యానాం నుంచి ఎన్.రంగసామిని బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించడంతో, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించుకుని నామినేషన్ దాఖలు చేశారు.

ఈ పరిణామాలతో ఆగ్రహించిన బీజేపీ అధిష్ఠానం దుర్గా ప్రసాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆపై గత గురువారం నాడు ఇంటి నుంచి వెళ్లిన ఆయన, తిరిగి రాకపోవడంతో ఆయన భార్య శాంతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా, ఆసుపత్రిలో కొంతమేరకు స్పృహలోకి వచ్చిన దుర్గా ప్రసాద్, తనను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తెలపడం గమనార్హం.

More Telugu News