బండ్ల గణేశ్ స్పీచ్ తో పొట్టచెక్కలయ్యేలా నవ్విన పవన్ కల్యాణ్

04-04-2021 Sun 22:03
  • హైదరాబాదులో వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హాజరైన పవన్ కల్యాణ్
  • తన బాస్ పవన్ కల్యాణేనంటూ బండ్ల గణేశ్ ఎమోషనల్
  • రాముడికి హనుమంతుడు ఎలాగో తాను పవన్ కు అలాగని వ్యాఖ్యలు 
Pawan Kalyan enjoys Bandla Ganesh speech in Vakeel Saab pre release event

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేశ్ ఎప్పట్లాగానే తనదైన శైలిలో భావోద్వేగాలతో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పవన్ కల్యాణ్... బండ్ల గణేశ్ ప్రసంగంతో పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఏడుకొండలవాడికి అన్నమయ్య, శివుడికి భక్తకన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కల్యాణ్ కు బండ్ల గణేశ్ అని సగర్వంగా చెప్పుకుంటా అని ఎమోషనల్ అయ్యారు. పవన్ కల్యాణ్ ఓ వ్యసనం అని, ఆయనను వదులుకోవాలన్నా కష్టమేనని అన్నారు. ఏవో మాయ మాటలు చెప్పి పవన్ తో సినిమా చేద్దామని వెళ్లినా ఆయన కళ్లలో నిజాయతీ చూసి వెనక్కి వచ్చేస్తానని వివరించారు.

ఓ వ్యక్తి పవన్ కల్యాణ్ కు పొగరు అని ఓసారి ఎయిర్ పోర్టులో తనతో అన్నాడని, అయితే అతడ్ని కేబీఆర్ పార్కులో పట్టుకుని పవన్ కల్యాణ్ గొప్పదనం వివరించానని అన్నారు. "శత్రుసైన్యాలకు చిక్కినా ఒక్క రహస్యం కూడా బయటికి చెప్పని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసానికున్నంత పొగరు పవన్ కు ఉందని చెప్పా. సరిహద్దుల్లో చైనా దురాక్రమణలను ఎదుర్కొనడానికి మరఫిరంగి ట్రిగ్గర్ నొక్కబోయే భారత సైనికుడికున్నంత పొగరుందని చెప్పా. భారతమాత ముద్దుబిడ్డ, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకున్నంత పొగరు ఉందని చెప్పా" అంటూ ఇంకా పలు నిదర్శనాలను వివరించారు. బండ్ల గణేశ్ స్పీచ్ కొనసాగుతున్నంతసేపు పవన్ నవ్వు ఆపుకోవడానికి విఫలయత్నాలు చేశారు.