చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు

04-04-2021 Sun 20:57
  • కివీస్ తో మొదటి వన్డేలో విజయం
  • వరుసగా 22 వన్డేల్లో నెగ్గిన జట్టుగా వరల్డ్ రికార్డు
  • గతంలో ఆసీస్ పురుషుల జట్టు పేరిట రికార్డు
  • అప్పట్లో వరుసగా 21 మ్యాచ్ లు నెగ్గిన పాంటింగ్ సేన
 Australia women cricket team creates history by most consecutive wins in ODIs

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. వరుసగా 22 వన్డేల్లో ఓటమన్నది లేకుండా అప్రతిహత జైత్రయాత్ర సాగింది. తద్వారా ఆసీస్ పురుషుల జట్టు గతంలో నమోదు చేసిన 21 మ్యాచ్ ల రికార్డును తిరగరాసింది.

2003లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా 21 మ్యాచ్ ల్లో నెగ్గి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. అప్పటినుంచి ఆ రికార్డు అలాగే ఉంది. అయితే ఆసీస్ మహిళల జట్టు ఇన్నాళ్లకు ఆ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించడం ద్వారా ఆసీస్ మహిళలు ఈ రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ఆ జట్టు చివరిసారిగా ఓడిపోయింది 2018లో. అక్కడ్నించి మొదలైన జైత్రయాత్ర నేటివరకు ఓటమి అనేదే లేకుండా కొనసాగుతోంది.

అప్పట్లో ఆస్ట్రేలియా పురుషుల జట్టు టెస్టు క్రికెట్లో ఇదే తరహాలో అత్యధిక విజయాలు నమోదు చేసింది. అయితే ఆ జట్టు భారత్ పర్యటనకు రాగా, కోల్ కతా టెస్టులో అద్భుత విజయంతో ఆ జైత్రయాత్రకు భారత్ గండికొట్టింది.