కుట్ర ప్రకారమే వైసీపీ బినామీకి గ్లాసు గుర్తు కేటాయించుకున్నారు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణ

04-04-2021 Sun 19:44
  • జనసేన గుర్తు లాక్కొన్నారని విష్ణు మండిపాటు
  • గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టీకరణ
  • కొడాలి నాని, పేర్ని నానిల భాష బాగాలేదని వెల్లడి
  • వాడు, వీడు అని సంబోధిస్తున్నారని ఆగ్రహం
BJP leader Vishnu Vardhan Reddy fires on YCP leaders

తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికల బరిలో వైసీపీ బినామీలతో నామినేషన్ వేయించి జనసేన గుర్తు లాక్కున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి  ఆరోపించారు. గ్లాసు గుర్తును కుట్ర ప్రకారమే బినామీకి కేటాయించుకున్నారని వెల్లడించారు. దీనిపై తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. తిరుపతి ఉప ఎన్నిక బరిలో నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేశ్ కుమార్ కు ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును కేటాయించడం తెలిసిందే.

అటు, జనసేనాని పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండడం పట్ల విష్ణు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొడాలి నాని, పేర్ని నాని వాడుతున్న భాష బాగోలేదని అన్నారు. వాడు, వీడు అని సంబోధిస్తూ మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ స్పెషల్ ఫ్లయిట్ లో వెళితే తప్పేంటి?... సీఎం జగన్ ఏమైనా సైకిల్ పై తిరుగుతున్నారా? అని విష్ణు ప్రశ్నించారు. ప్రధానికి ఎర్రచందనం వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ సినిమాల్లోనే హీరో అని అన్నారు. రాజకీయాల్లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టు మాత్రమేనని వ్యాఖ్యానించారు.