కరోనా కట్టడికి కొత్త వ్యూహాలు అనుసరించాల్సిందే: ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్‌ గులేరియా

04-04-2021 Sun 19:04
  • దేశవ్యాప్తంగా కరోనా సామాజిక వ్యాప్తి
  • కట్టడి చర్యల్ని వేగవంతం చేయడమే తక్షణ కర్తవ్యం
  • ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా కొత్త వ్యూహాలు
  • మైక్రో లాక్‌డౌన్‌ అనే కొత్త ప్రతిపాదన
  • ప్రజల నిర్లక్ష్యం, కొత్త రకాలే విజృంభణకు కారణమన్న గులేరియా
To Contain corona new strategies has to be followed

దేశవ్యాప్తంగా మరోసారి విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేయాలంటే కొత్త వ్యూహాలు అనుసరించాల్సిందేనని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా  స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాజిక వ్యాప్తి(కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) ఉందని.. దాన్ని కట్టడి చేయడమే తక్షణ కర్తవ్యమని తెలిపారు.

కంటైన్‌మెంట్‌ జోన్లను గుర్తించడం, లాక్‌డౌన్‌లు విధించడం, నిర్ధారణ పరీక్షల్ని పెంచడం, బాధితుడితో కలిసిన వారికి గుర్తించి వేరు చేయడం వంటి చర్యల్ని మరింత వేగవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని గులేరియా తెలిపారు. అలాగే ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో దెబ్బతినకుండా మైక్రో లాక్‌డౌన్స్ వంటి కొత్త వ్యూహాల్ని అమలు చేయాలని ప్రతిపాదించారు. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవడం, విహారయాత్రల్ని వాయిదా వేసుకోవడం వంటి చర్యలతోనూ కరోనాను కట్టడి చేయవచ్చని సూచించారు. ఇలాంటి చర్యల వల్ల ఇప్పటి వరకు కరోనాతో ప్రభావితం కాని ప్రాంతాలకు అసలు కొవిడ్‌ ప్రవేశించే అవకాశమే ఉండదని తెలిపారు.

మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనల్ని పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కేసుల పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించినట్లు గులేరియా తెలిపారు. అలాగే కొత్త రకం వైరస్‌లు పుట్టుకురావడం దానికి మరింత ఆజ్యం పోసిందని పేర్కొన్నారు.