రాజకీయాలకు ఆటంకం అని భావిస్తే సినిమాలకు స్వస్తి పలుకుతా: కమల్ హాసన్

04-04-2021 Sun 18:27
  • తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • కోయంబత్తూరులో కమల్ పోటీ
  • డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నట్టు వెల్లడి
  • గతంలో ఎంజీఆర్ కూడా ఇలాగే చేశారని వివరణ
Kamal Haasan clarifies he would stop doing cinemas if needed

తమిళనాడు రాజకీయాల్లో మార్పు తేవాలని, ప్రజలను అభివృద్ధి దిశగా నడిపించాలన్న ఆకాంక్షలతో పార్టీ స్థాపించిన నటుడు కమల్ హాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ విజయం కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పలు పార్టీలతో పొత్తు నేపథ్యంలో కమల్ హాసన్ సారథ్యంలోని మక్కళ్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పరిమిత సంఖ్యలోనే పోటీ చేస్తోంది. కమల్ కోయంబత్తూరు సౌత్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు. తాజాగా కోయంబత్తూరులో ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన రాజకీయాలకు ఆటంకం కలిగిస్తాయనుకుంటే సినిమాలకు స్వస్తి పలుకుతానని స్పష్టం చేశారు. డబ్బు సంపాదన కోసం ఇప్పటికే పలు సినిమాలు అంగీకరించానని, వాటిని పూర్తి చేస్తానని వెల్లడించారు. ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకే సొంతంగా సంపాదించాలని కోరుకుంటున్నానని వివరించారు.

అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో సహవాసం చేస్తుండడం పట్ల తనపై వస్తున్న విమర్శలకు కమల్ హాసన్ బదులిస్తూ... గతంలో ఎంజీఆర్ అంతటివాడు కూడా ఎమ్మెల్యేగా గెలిచినా అనేక సినిమాల్లో నటించారని గుర్తు చేశారు. తన రాజకీయ కార్యకలాపాలకు అవసరమైన డబ్బు కోసమే ఆయన నటించారని, తాను కూడా అంతేనని పేర్కొన్నారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మునే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నానని, ఈ విషయంలో తన నిజాయతీని ఎన్నికల సంఘం అధికారులు ప్రశంసించారని కమల్ వెల్లడించారు.