మహారాష్ట్రలో కరోనా బీభత్సం... రాత్రి కర్ఫ్యూ, వారాంతాల్లో లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం

04-04-2021 Sun 18:12
  • మహారాష్ట్రలో నిత్యం వేల సంఖ్యలో కేసుల నమోదు
  • నిత్యం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 వరకు లాక్ డౌన్
  • 50 శాతం సామర్థ్యంతోనే ప్రజా రవాణా వాహనాలకు అనుమతి
  • ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం
  • 50 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ
Government announced weekend lock down in Maharashtra

భారత్ లో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో సగం మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో రాత్రివేళ కర్ఫ్యూ విధిస్తున్నట్టు తెలిపింది.

 ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. అంతేగాకుండా వారాంతాల్లోనూ లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటన చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఐదుగురు, అంతకుమించి గుమికూడరాదని తెలిపింది.

ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించాలని పేర్కొంది. ప్రజా రవాణా వాహనాలను 50 శాతం సామర్థ్యంతోనే తిప్పాలని స్పష్టం చేసింది. హోటళ్లలో పార్శిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అది కూడా పగటివేళల్లోనే ఫుడ్ డెలివరీలకు అనుమతి ఇచ్చింది. త్వరలోనే పరిస్థితిని సమీక్షించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.