అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవడంపై రమణ దీక్షితులు స్పందన

04-04-2021 Sun 16:26
  • పదవీ విరమణ చేసిన అర్చకులకు మళ్లీ బాధ్యతలు
  • టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు పునర్నియామకం
  • వంశపారంపర్య హక్కులతో అర్చకులు నష్టపోయారని వెల్లడి
  • ఆలయాలు మూతపడ్డాయని వివరణ
  • న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారన్న రమణ దీక్షితులు
Ramana Deekshitulu responds on his re appointment

గతంలో పదవీ విరమణ చేసిన అర్చకులను టీటీడీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటుండడం తెలిసిందే. ఈ క్రమంలో రమణ దీక్షితులు మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమితులయ్యారు. తన పునర్నియాకమంపై రమణ దీక్షితులు స్పందించారు. నేడు శ్రీవారిని దర్శించుకున్న ఆయన.... సీఎం జగన్, కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్టు వెల్లడించారు. రాజు క్షేమంగా ఉండాలని తాము దైవ ప్రార్థన చేస్తామని, రాజు ఎవరన్నది తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

అర్చకులకు న్యాయం చేస్తామని జగన్ గతంలోనే హామీ ఇచ్చారని రమణ దీక్షితులు వెల్లడించారు. అర్చకుల హక్కులను ముఖ్యమంత్రి హోదాలో జగన్ పరిరక్షిస్తున్నారని కొనియాడారు. సాంకేతిక కారణాలతోనే వయసు నిబంధన సడలింపులో జాప్యం జరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలోని దేవాలయాలను,అర్చకుల కుటుంబాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమని అన్నారు. వంశపారంపర్య హక్కుల రద్దుతో అర్చకులు నష్టపోయారని తెలిపారు. వంశపారంపర్య హక్కుల రద్దు నిర్ణయంతో చాలా ఆలయాలు మూతపడ్డాయని వివరించారు.