చరిత్ర తెలియని అధికార పార్టీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

04-04-2021 Sun 15:26
  • నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి
  • నేడు సాగర్ లో కార్యకర్తల సమావేశం
  • హాజరైన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • టీఆర్ఎస్ నేతలు మదమెక్కి మాట్లాడుతున్నారని ధ్వజం
Uttam Kumar Reddy fires in TRS leaders

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి మద్దతుగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొంటున్నారు. నేడు నాగార్జునసాగర్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, చరిత్ర తెలియని అధికార పార్టీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టును కట్టించింది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు.

సాగర్ లో జానారెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ టీఆర్ఎస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గడచిన ఏడేళ్లలో సాగర్ లో టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. జానారెడ్డిని ప్రజలు గెలిపించాలని, ఆయన గెలిస్తే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు.