Naxals: చత్తీస్ గఢ్ లో మరోసారి మావోల ఘాతుకం... ఈసారి మందుపేతర పేల్చిన వైనం

  • చత్తీస్ గఢ్ లో నిన్న భారీ ఎన్ కౌంటర్
  • ఇప్పటివరకు 24 జవాన్ల మృతదేహాలు స్వాధీనం
  • కొనసాగుతున్న గాలింపు చర్యలు
  • భద్రతా బలగాలే లక్ష్యంగా మందుపాతర పేల్చిన నక్సల్స్
Naxals blasts landmine in Chhattisgarh

చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాల జవాన్లు గల్లంతు కాగా, వారికోసం అదనపు బలగాలు గాలిస్తున్న తరుణంలో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. నిన్న ఎన్ కౌంటర్ జరిగిన సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలోనే నేడు మందుపాతర పేలింది. భద్రతా బలగాలే లక్ష్యంగా మావోలు ఈ చర్యకు పాల్పడ్డారు.

కాగా, నిన్నటి ఎన్ కౌంటర్ లో మృతి చెందిన జవాన్ల సంఖ్య 24కి పెరిగింది. మృతుల్లో 9 మంది కోబ్రా దళాలకు చెందినవారు కాగా, 8 మంది డీఆర్జీ సిబ్బంది, ఆరుగురు ఎస్పీఎఫ్ సిబ్బంది, ఓ బస్తర్ బెటాలియన్ జవాను ఉన్నారు. నక్సల్స్ దాడిలో 31 మంది జవాన్లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు. తీవ్రంగా గాయపడిన జవాన్లలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. అటు, నక్సల్స్ దాడి ఘటనలో గల్లంతైన జవాన్ల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

More Telugu News