మరో 5 రోజుల్లో ఫస్ట్​ మ్యాచ్​.. ఆర్సీబీకి గట్టి షాక్​

04-04-2021 Sun 12:40
  • ఓపెనర్ దేవ్ దత్ పడిక్కల్ కు కరోనా పాజిటివ్
  • ఐపీఎల్ తొలి రెండు మ్యాచ్ లకు దూరం
  • ఐసోలేషన్ లో ఉంచిన టీమ్ మేనేజ్ మెంట్
Royal Challengers Bangalore opener Devdutt Padikkal tests positive for coronavirus

ఐపీఎల్ కు మరో ఐదు రోజులే సమయముంది. కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కీ మిగిలి ఉంది అంతే టైం. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తో ఆర్సీబీ మొదటి పోరు జరగనుంది. కానీ, ఈ లోపే ఆర్సీబీకి గట్టి షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ దేవ్ దత్ పడిక్కల్ మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడికి కరోనా పాజిటివ్ రావడమే అందుకు కారణం.

దీంతో అతడిని ఆర్సీబీ యాజమాన్యం ఐసోలేషన్ లో ఉంచింది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో పడిక్కల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. 15 మ్యాచ్ లలో 31.53 సగటుతో 473 పరుగులు చేసి తన సత్తా చాటాడు. తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపీలోనూ చెలరేగుతున్నాడు. కర్ణాటక తరఫున బరిలో దిగిన అతడు 43.6 సగటుతో కేవలం ఆరు మ్యాచ్ లలోనే 218 పరుగులు చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ చెలరేగిపోయాడు. 7 మ్యాచ్ లలో 147.4 సగటుతో ఏకంగా 737 రన్స్ సాధించాడు. ఈ నేపథ్యంలో అతడు ఆర్సీబీకి తొలి రెండు మ్యాచ్ లకు దూరమవడం పెద్ద లోటేనని చెబుతున్నారు.