గాయ‌మై క‌ట్టుక‌ట్టించుకున్న కాలిని ప‌దే ప‌దే ఊపిన మ‌మ‌తా బెన‌ర్జీ.. వీడియో వైర‌ల్

04-04-2021 Sun 12:18
  • కొన్ని రోజుల క్రితం గాయం
  • వీల్‌చైర్‌లోనే మ‌మ‌త ప్ర‌చారం
  • రెండు కాళ్లను వెనకకు, ముందుకు ఆడించిన మ‌మ‌త‌
Mamata seen shaking injured leg

ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కాలికి కొన్నిరోజుల క్రితం గాయ‌మైన విష‌యం తెలిసిందే. ఆమె కాలికి వైద్యులు పెద్ద క‌ట్టు క‌ట్టారు. అయిన‌ప్ప‌టికీ, ఆమె ఆ‌ క‌ట్టుతోనే వీల్‌చైర్‌లో కూర్చొని ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు.

అయితే, ఎన్నిక‌ల నేప‌థ్యంలో సానుభూతి పొంద‌డం కోసం కాలికి తీవ్ర‌గాయ‌మైంద‌ని ఆమె అస‌త్యాలు చెబుతున్నార‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. వారి ఆరోప‌ణ‌ల‌ను బ‌ల‌ప‌ర్చేలా ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాధారణంగా కాలికి గాయ‌మై అంత పెద్ద క‌ట్టుకోవాల్సి వ‌స్తే దాన్ని క‌దప‌కూడ‌దు. ఈ వీడియోలో మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం గాయమైన‌ కాలిని ఊపుతూ క‌నిపించారు.

ఆమె రెండు కాళ్లను వెనకకు, ముందుకు ఆడిస్తూ ఓ టేబుల్ వ‌ద్ద వీల్ చైర్‌లో కూర్చున్నారు. ఓ కాలిని మ‌రో కాలిపై వేసుకుని మ‌రీ కూర్చున్నారు. దీంతో కాలికి గాయమైన‌ట్లు ఆమె డ్రామాలు ఆడుతున్నార‌ని మ‌రోసారి బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.  అంత‌గా నొప్పి ఉన్న కాలిని ఆమె ఎలా క‌దిలించారని ప్ర‌శ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైర‌ల్ చేస్తున్నారు. కాగా, ప‌శ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిశోర్ ప‌ని చేస్తోన్న విష‌యం తెలిసిందే.