Chattisgarh: ఛత్తీస్​ గఢ్​ ఎన్​ కౌంటర్​: 21 మంది జవాన్ల ఆచూకీ గల్లంతు

  • జాడ కనిపెట్టేందుకు ఆపరేషన్ జరుగుతోందన్న పోలీసులు
  • జగదళ్ పూర్ కు ఇద్దరు జవాన్ల మృతదేహాలు
  • ఘటనపై అమిత్ షా ఆరా
  • అమర జవాన్లకు నివాళులు
21 jawans missing after deadly encounter with Naxals on Sukma Bijapur border

ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 21 మంది సీఆర్పీఎఫ్, ‘కోబ్రా’ జవాన్ల ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తోంది. శనివారం నక్సలైట్లతో జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. మరో 30 మంది దాకా గాయపడ్డారు. ఆదివారం పరిస్థితిని సమీక్షించేందుకు సుక్మా సరిహద్దులకు సీఆర్పీఎఫ్ డీజీపీ వచ్చారని ఛత్తీస్ గఢ్ పోలీసులు చెబుతున్నారు. ఇప్పటిదాకా 21 మంది జవాన్ల సమాచారం తెలియరాలేదన్నారు.


మరోవైపు చనిపోయిన ఐదుగురు జవాన్లలో కేవలం ఇద్దరి మృతదేహాలే లభించాయని, వారి మృతదేహాలను జగదళ్ పూర్ లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ నకు తరలించారని చెప్పారు. మిగతా వారి మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు, కనిపించకుండా పోయిన వారి జాడ కనిపెట్టేందుకు ఆపరేషన్ జరుగుతోందని అంటున్నారు. గాయపడిన మరో 30 మంది జవాన్లలో 23 మందిని బీజాపూర్ ఆసుత్రికి, ఏడుగురిని రాయ్ పూర్ ఆసుపత్రికి తరలించామని చెప్పారు. చనిపోయిన మహిళా మావోయిస్టు మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు.

ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగల్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చించారు. పరిస్థితిపై ఆరా తీశారు. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ‘‘ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులతో పోరాడుతూ ప్రాణ త్యాగం చేసిన ధీశాలులైన భద్రతా సిబ్బందికి తల వంచి నమస్కరిస్తున్నాను. మీ ధైర్యసాహసాలను, త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువబోదు. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. శాంతి, అభివృద్ధిలకు ఆటంకం కలిగించే విరోధులతో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News