Ramana Dikshitulu: టీటీడీ నిర్ణ‌యంతో విధుల్లో చేరిన ర‌మ‌ణ దీక్షితులు

ramana dikshitulu joins in duty
  • వయో పరిమితి ముగియ‌డంతో గ‌తంలో ప‌ద‌వీ విర‌మ‌ణ
  • తాజాగా హైకోర్టు ఆదేశాలను పాటించిన టీటీడీ
  • తిరిగి తీసుకోవాల‌ని నిన్న‌ ఉత్త‌ర్వులు జారీ  
మూడేళ్ల క్రితం వయో పరిమితి ముగిసి ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిన్న‌ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో హైకోర్టు ఇచ్చిన‌ తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌ ప్రధాన అర్చకులతో పాటు ఇత‌ర‌ అర్చకులు విధుల్లో చేరాలని టీటీడీ తెలప‌డంతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరారు.

అయితే, ప్రస్తుతం గొల్లపల్లి వంశం నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల్ దీక్షితులు కొనసాగుతున్నారు. ఆయ‌న పర్మినెంట్ ఉద్యోగి కావడంతో అధికార బదలాయింపులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోవ‌ని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, 65 ఏళ్లు దాటిన అర్చకులు పదవీ విరమణ చేయాల‌ని 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది.

ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లో టీటీడీతో పాటు గోవింద రాజ‌స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు నిండిన‌ అర్చకులంద‌రూ రిటైర్ అయ్యారు. వారిలో రమణ దీక్షితులతో పాటు ఆయా ఆలయాల నుంచి 10 మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ అర్చకులు మరో 10 మంది విధుల నుంచి త‌ప్పుకున్నారు.

దీంతో అప్ప‌ట్లోనే వారి స్థానంలో  తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడి ఆలయ ప్రధాన అర్చకులుగా పైడిపల్లి వంశం నుంచి ఏఎస్‌ కృష్ణ శేషాచల దీక్షితులు, గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల్ దీక్షితులు, పెద్దింటి శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందాచార్యులు నియమితుల‌య్యారు.
Ramana Dikshitulu
TTD
Tirumala

More Telugu News