నా కుమార్తెకు ఓటు వేయవద్దు: డీఎంకే మహిళా అభ్యర్థికి వ్యతిరేకంగా తల్లి ప్రచారం!

04-04-2021 Sun 10:28
  • తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు
  • ఆలంగుళం నుంచి పోటీ చేస్తున్న పూంగోదై
  • ప్రభుత్వ నిధులు స్వాహా చేసిందని తల్లి ఆరోపణ
Dont Vote for my Daughter says DMK Candidate Mother in Tamilnadu

తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కరుణానిధి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఓ మహిళ, ఆలంగుళం నుంచి పోటీ చేస్తుండగా, తన కుమార్తెకు ఓట్లు వేయవద్దని స్వయంగా ఆమె తల్లే కోరుతుండటం చర్చనీయాంశమైంది. డీఎంకేలో సీనియర్ మహిళా నేతగా పేరున్న పూంగోదై, గతంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె తల్లి కమల, నియోజకవర్గం అభివృద్ధికి తన కుమార్తె చేసిందేమీ లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో కట్టించిన నిర్మాణాలను సొంతం చేసుకున్నదని, నిధులను స్వాహా చేసిందని అన్నారు. నియోజకవర్గంలోని ఓటర్లు తమ మనస్సాక్షి మేరకు ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.